Thursday, April 27, 2017

Baahubali2 the Conclusion Review

పెద్ద హీరోల సినిమాలకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూడటం మామూలే.. కానీ యావత్ సినీ అభిమానులు భాష కి అతీతంగా  "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. " why kattappa killed Baahubali" అంటూ ఎంతో మురిపెంగా ఎదురు చూసేలా చేసి మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లిన బాహుబలి నిజంగా మనకి ఎంతో గర్వకారణం .. మరి జక్కన్న రాజమౌళి మెదళ్ళు తొలిచేసిన ఆ ప్రశ్న అంతే అద్భుతమైన సమాధానం ఇచ్చ్చాడా  ??!!

No Spoilers : కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు తో పాటు బాహుబలి దేవసేనల ప్రేమ కథ ఈ రెండవ భాగానికి ప్రధమ ఆకర్షణ .. అలాగే శివుడుకి పెదనాన్న భళ్లాలదేవునికి అంతిమ యుద్ధం .. 

పాత్రలు .. 
భారతంలో పాత్రలు బట్టికొట్టడం కష్టమేమో కానీ బాహుబలి లో శివగామి.. కట్టప్ప దేవసేన పేర్లు ఇవాళ్టి పిల్లా పాపలు ఠకీ మని చెప్పేస్తారు 

అమరేంద్ర బాహుబలి ... ప్రభాస్ కి బాహుబలి పాత్ర రాసిపెట్టుందా ..బాహుబలికి ప్రభాస్ అనే నటుడు రాసిపెట్టునాడా .. అన్నంతగా కలగలిసి పోయాయి ఆ రెండు పేర్లు .. రాజసం .. ధీరత్వం .. దేవసేన తో ప్రేమ .. కట్టప్ప మామతో చమత్కారం.. అమ్మ మీద ఎనలేని గౌరవం .. ప్రజలంటే అమిత మమకారం .. అన్నింటిని సమంగా చేసి తెలుగు సినిమాలోనే ఓ గొప్ప కథానాయకుని పాత్రకు ప్రాణం పోసాడు ప్రభాస్ .. 

కట్టప్ప .. సత్యరాజ్ కి మారు పేరుగా మారింది .. హీరో తరువాత హీరో అంతటి బరువుంది కట్టప్పకి "2" లో .. కట్టప్ప చంపితే చూసే ప్రేక్షకుడి కంటి తడి రావాలని ఆలోచనతో కాబోలు.. ప్రతి క్షణం భాహుబలితోనే ప్రయాణం చేయించాడు దర్శకుడు .. అందుకు తగ్గట్టు సత్యరాజ్ ఎంతో హుందాగా అలరించాడు .. 

దేవసేన .. మొదటి సినిమాలో గ్లామర్ పరంగా నిరాశపరిచిన అనుష్క ఈ సారి అందంతో దిమ్మదిరిగేలా అదరగొట్టింది ..అభిమానం గల యువరాణిగా .. వీరోచిత నారిగా .. మాహిష్మతి మలినాలకు  ఎదురుతిరిగే యువతిగా .. ఇలా ఎన్నో షేడ్స్ .. అసలు దేవసేనగా అనుష్క మాత్రమే సరిపోతుంది అనేలా ఉంది ఆమె పాత్ర .. 

మొదటి భాగంలోని అవే ఛాయలని కొనసాగించింది శివగామి .. ఒక మంచి తల్లి పాత్ర కావటం వల్ల  ఒక పరిధి ఏర్పడింది .. కానీ ఆ పరిధి లోనే బాహుబలి మీద కోపాన్ని ..  అలాగే పశ్చాత్తాపాన్ని చక్కగా చూపించింది రమ్యకృష్ణ .. నాకు మాత్రం ఇప్పటికి నరసింహాలో నీలాంబరి ఆమె బెస్ట్ రోల్ . 

నాజర్ .. బిజ్జలదేవుడిగా కథ ముందుకు నడిచేందుకు బాగా దోహదపడ్డాడు .. 

హీరోకి సమానంగా .. ఇంకాస్త ఎక్కువగానే విలన్ ని చూపించటం రాజమౌళి అలవాటు .. కానీ భల్లాలదేవుడు పాత్రలో అంత క్రూరత్వం కనిపించలేదు  ..అందువల్ల రానా పాత్ర చాలా పాసివ్ గా అనిపించింది 

దేవసేన బావ కుమారవర్మ  గా సుబరాజు మంచి కామెడీ చేసి తరువాత సహాయపాత్రలో బాగున్నాడు .. రెండు సార్లు కనురెప్పలు అలా మూస్తే తమన్నా కనిపించకపోవచ్చు మీకు ఈ భాగంలో ... 

మొదటి సగం అద్భుతః .. రెండో సగం బాగుంది .. 
పేర్లు వేసేప్పుడు మొదటిభాగాన్ని బొమ్మలు ద్వారా చెప్పటం సూపర్ గా ఉంది .. ఇక ప్రభాస్ ఆగమనం సాహోరే బాహుబలి అబ్బురపరుస్తాయి .. ఎప్పుడు పగ .. ప్రతీకారం .. రౌద్రం .. మీద ఫోకస్ పెట్టె రాజమౌళి ఈసారి బాహుబలి - దేవసేనల ప్రేమని ఏంటో గమ్మత్తుగా .. చాలా అందంగా చూపించాడు .. హంస నావ పాట చాలా బాగుంది.. అలాగే కృష్ణుని జోల పాట సందర్భం లిరిక్స్ చాలా బాగున్నాయి .. మొదటి సగంలో కుంతల రాజ్యంలో జరిగే యుద్ధం ఆసాంతం హైలైట్ .. మొత్తంగా మొదటి సగం అమేజింగ్ అంతే .. 

ఇక రెండవ భాగంలో మన ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం .. బాహుబలి కట్టప్పని చంపే కారణం మరియు ఆ చంపే సన్నివేశం . అభిమానుల రెండేళ్ల అలుపెరుగని ఎదురుచూపుల ఆకలిని తీర్చేంత కిక్కు ఇవ్వలేదని అనిపించింది .. అలా అక్కడ కొంచెం నెమ్మదిగా .. తరువాత కొంచెం పరుగులు తీసినట్టుగా అనిపించింది .. దేవసేన-శివగామి పాత్రల మధ్య సంఘర్షణ చాలా బాగుంది .. చివరి యుధ్ధంలో  రాజమౌళి తరహా గూసిబంప్స్ కి కొదవలేదు ... ఎందుకంటే అక్కడ దేవసేన పేర్చిన చితి .. అలాగే భళ్లాలదేవుని భారీ విగ్రహం లాంటి సాధనాలు సిద్ధంగా ఉన్నాయి .. 

తెర వెనుక దాగున్న వారికి పాదాభివందనాలు .. 
ఇంత పెద్ద యజ్ఞానికి సంకల్పించి ఎంతో వినూత్నంగా విస్తృతంగా ప్రచారం చేసిన శోభు-ప్రసాద్లకు .. అహర్నిశలు శ్రమించిన నేటి తెలుగు మేటి దర్శకుడు రాజమౌళిగారికి .. సంగీత దర్శకులు కీరవాణి గారు.. అత్యద్భుతమైన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇలా ఎందరో మహానుభావులు .. అందరికి వందనాలు .. బాహుబలిని ఓ పండుగగా మలచినందుకు ... 

రేటింగ్ : 80/100 ( నేను 100 కి 100 అని ఊహించుకున్నాను ..:) ఆకాశమంతటి అంచనాలని అందుకోవటం అంత సులభం కాదు .. వాటిని దాదాపుగా అందుకుని మన తెలుగు సినీ గౌరవాన్ని మరింతగా పెంచి చరిత్రలో కలకాలం నిలిచిపోయే కలికితురాయి "బాహుబలి" .. సాహో