Saturday, July 12, 2014

Drushyam movie review



"దృశ్యం" మళయాలం లో మోహన్ లాల్ -మీనా నటించిన మాంచి హిట్టైన సినిమా .. మంచి కధాంశం .. పట్టున్న స్క్రీన్ ప్లే ఉన్న సినిమా కావటంతో ఒకేసారి అన్ని దక్షిణ బాషా దర్శక నిర్మాతలని ఇట్టే  ఆకట్టేసుకుంది . మొన్నీమధ్యే కన్నడ లో రవిచంద్రన్ హీరోగా  పి. వాసు గారు తీస్తే అక్కడా దుమ్ము దులిపింది .. ఇప్పుడు మన తెలుగు వంతు . నిన్నటి తరం అగ్ర హీరో విక్టరీ  వెంకటేష్ చేయటం తో ఇక్కడ కూడా కాసింత ఆసక్తి రేపింది . ఇక రిలీజ్ అయినప్పటి నుంచి వచ్చిన రివ్యూస్ అండ్ మౌత్ టాక్ తో విజయవంతంగా దూసుకెళ్తుంది ... 

కట్టే .. కొట్టే .. తెచ్చే .. 
ఇలా చెప్పాలంటే .. ఒక కుటుంబం .. ఒక సమస్య .. ఒక హత్య ..  ఒక అన్వేషణ .. ఒక తీర్పు .. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇంత కంటే చెప్తే రివ్యూ చదివే వారికి నచ్చదు ..!!

మంచి రీమేక్ ఎంచుకున్న వెంకటేష్ .. 
ఒకప్పుడు రీమేకులతో హిట్లు కొట్టిన విక్టరీ వెంకటేష్ ఈ మధ్య అవే రీమేకులతో కెరీర్ కి బోలెడన్ని  మేకులు కొట్టుకున్నాడు . కాని ఈ సారి ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించి దృశ్యం సినిమాని మన తెలుగు లో కూడా ఎక్కువ మందికి చేరేలా చేసారు . హుందాతనం నిండిన.. వయసుకు తగ్గ పాత్ర ఎంచుకోవడం ఓ ఎత్తు .. రాంబాబు లా ప్రతి దృశ్యం లో మెప్పించడం ఓ ఎత్తు . ఓ మధ్య తరగతి తండ్రి తన కుటుంబం కోసం ఎంత కష్ట పడతాడో చెప్పే పాత్ర . 

చంటి, సుందరకాండ , అబ్బాయి గారు , సూర్య వంశం - ఒకటి మించిన ఒకటి హిట్ కాంబినేషన్ వెంకటేష్-మీనా లది .. అందుకే చాలా కాలం తరువాత చూడగానే ముచ్చట గా ఉంది .. కూతుళ్ళు గా చేసిన ఇద్దరమ్మాయిలు బాగా చేసారు .. మాతృక మళయాలం లో వీరే నటించారంట . 

మన లేటెస్ట్ అత్తగారు నదియా చేసిన ఐజీ రోల్ బాగుంది . నరేష్ ఆమె భర్త గా చేసాడు . క్రూర మైన కానిస్టేబుల్ వీరభద్రం గా రవి కాలే జీవించాడు . ఒక సినిమా లో పట్టు అతని పాత్ర వల్లే . 

మొదటి పది నిమిషాలు సప్తగిరి కాస్త నవ్వించాడు .. రెండు నిమిషాల పాత్రలైనా మనకి బాగా తెలిసిన తెలుగు నటులు ఉండటం తో నేటివిటీ కుదిరింది . 

శ్రీ ప్రియ .. 
వెంకటేష్ ని డైరెక్ట్ చేసిన తొలి మహిళా దర్శకురాలు .. నటిగా మూడొందలు పై చిలుకు సినిమాలు చేసారామే . రీమేక్ అయిన తెలుగు నేటివిటీ పోకుండా .. స్క్రీన్ ప్లే మేజిక్ ని చక్కగా అనువదించారు .. 

ఆగస్టు రెండో తారీకు .. మూడో తారీకు .. !!
హహ .. ఈ రెండు తేదీలు ఎందుకు చెప్పానో ఈ సినిమా చూస్తె తెలుస్తుంది .. పాత్రల పరిచయం .. కొన్ని జోకులు .. మొదట్లో భార్య భర్తల సంభాషణలు ప్రతి వారికి దగ్గరగా అనిపిస్తాయి .. ఇలా అరగంట తరువాత కధ పట్టలేక్కేస్తుంది . రెండో సగం పైన చెప్పిన ఆ రెండు తేదిల వల్ల కొంచెం గమ్మత్తు గా సాగుతూ చివరికి వచ్చే సరికి సీరియస్ గా మారి కధ క్లైమాక్స్ కి చేరుతుంది .. 

ఇదేదో మర్డర్ మిస్టరీ .. భారి సస్పెన్స్ థ్రిల్లర్ కాదు .. ఒక ప్రధాన సమస్యని .. ఒక ఫామిలీ కి .. ఒక క్రైమ్ కి ముడి పెట్టి చక్కగా నడిపించిన సినిమా .. హీరో ఎంత తెలివిగా ఆలోచిస్తాడో .. ఇన్వెస్టిగేషన్ చేసే నదియా కూడా అంతే తెలివిగా ఆలోచించడం బాగుంది . 

చివరగా .. 
సినిమాలో కడుపుబ్బా నవ్వించే కామెడీ .. ఫారిన్ లో పాటలు .. రిస్కీ ఫైట్ లు లేక పోయినా .. థియేటర్ లోంచి బయటకి వచ్చేపుడు ఒక సంతృప్తికరమైన చిరునవ్వు ..ఇంకొంచెం సేపు మిమ్మల్ని ఆలోచింప చేసే సినిమా దృశ్యం .. మీకు వీలుంటే చూడదగ్గ సినిమా 

రేటింగ్ 
66/100