ఒకప్పుడు కృష్ణ గారి ఏడూ సినిమాలు ఒకేసారి థియేటర్లలో సందడి చెసేవట .. అప్పుడెప్పుడో బాలకృష్ణ బంగారు బుల్లోడు , నిప్పురవ్వ ఒకేసారి విడుదలయ్యాయి .. మళ్ళీ చాలా కాలం తరువాత ఈ ఉగాదికి నాని రెండు సినిమాలు జెండా పై కపిరాజు ... ఎవడే సుబ్రహ్మణ్యం .. విదుదలయ్యాయి. లేటెస్ట్ బెటర్ మరియు హిమాలయాలు కూడా చూసోచ్చేయోచ్చు అనే ఆలోచన తో నా ఓటు సుబ్రమన్యాణికే వేసాను .
కథ : జీవితం లో బోలెడంత డబ్బు సంపాదించాలి అనే లక్ష్యాన్ని 8వ తరగతి నుంచే ఒంటబట్టించుకుంటాడు సుబ్రహ్మణ్యం . తను కోరుకునే పదవి , బాస్ కూతురితో పెళ్లికి రెడీ అవుతూ .. అంతా ఒకే అనుకున్న టైం లో తన చిన్ననాటి స్నేహితుడు రిషి .. వాళ్లెప్పుడో చిన్నపుడు అనుకున్నట్లుగా హిమాలయాల దగ్గర దూద్ కాశి కి వెళ్ళాల్సిందే అని పట్టు పడతాడు ..
అలా నాని ఆశల్ని తలకిందులు చేస్తూ జీవతపు రుచి చూపించి .. అసలు ఎవడీ సుబ్రహ్మణ్యం అని తేల్చి చెప్పే ప్రయాణమే అసలు సినిమా ..
ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు నాని ... డబ్బు హోదానే లోకంగా తలిచి.. జీవిత తత్వాన్ని .. స్నేహపు విలువల్ని తెలుసుకునే క్రమంలో ఆ పాత్ర లో మార్పుని చక్కగా ప్రెసెంట్ చేసాడు . రిషి (విజయ దేవరకొండ)ది సినిమాలో కనిపించినంత కాసేపు బోలెడంత సందడి చేసి .. మిగిలిన సగాన్ని నడిపించే క్యారెక్టర్ .. హీరోయిన్ హైట్ ఉన్న నిత్యమేనన్ లా ఉంది . అందంతో కంటే అభినయం తో ఆకట్టుకుంది . కృష్ణంరాజు గారిది హుందా నిండిన పాత్ర . షావుకారు జానకి గారిని మరోసారి చూసే అవకాశం దక్కింది. పెంబా గా చేసిన హిందీ నటుడు ఆకట్టుకున్నాడు.
గౌతమ బుద్దుడు .. గమ్యం .. సుబ్రహ్మణ్యం ..
సిద్దార్దుడు రాజ్యాని త్యజించి జీవిత సత్యాన్ని గ్రహించే కథతో క్రిష్ గమ్యం చేసారు .. అలాంటి ఓ కాన్సెప్ట్ తో గొంగళిపురుగు లాంటి మనిషి తత్త్వం సీతాకోక చిలుకలా ఎలా పరివర్తన చెందిందో ఓ సరికొత్త ప్రయాణం లా రూపొందించాడు కొత్త డైరెక్టర్ నాగ అశ్విన్ .
మనమెప్పుడు వెళతామో దూద్ కాశి ?
మొదటి సగం లక్ష్యం ఒక్కటే .. హీరోని హిమాలయాలకు పంపాలి .. ఇంటర్వెల్ తరువాతే అసలు ప్రయాణం .. ఒక్కో సీన్ ని మించిన కాన్వాస్ ఇంకో సీన్ కుంది . అడుగడునా వావ్ అంటూనే ఉంటాయి మన కళ్ళు .. నిజంగా చూసిన వారికి .. సినిమా తీసిన వారికి పాపం కాళ్ళ నెప్పులు ఉంటాయేమో కాని ..అంత అందంగా హిమాలయాలు చూపిస్తుంటే ఇక వేరే వంక ఎం పెట్టాలి అనిపించలేదు . లైఫ్ అంటే లెక్కలు నిచ్చెనలు అనే ఆలోచన నుంచి స్నేహం కోసం ప్రాణాలకి తెగించే , నిజమైన ప్రేమని గుర్తించే మనిషి లోపలి ప్రయాణం కళ్ళకి కనిపించే కొండలు కొనలకి దీటుగా ఉంది . పాటలు అందంగా సందర్భోచితంగా ఉన్నాయి
చివరగా ..
మనకి మంచి సినిమాలు కావాలి .. మసాలా సినిమాలు కావాలి .. అలాగే అడపాదడపా మంచివి వస్తూనే ఉన్నాయి .. సో మంచు కొండల్ని చూస్తూ .. ఓ మంచి మెసేజ్ ని ఆస్వాదించాలంటే ఆలస్యం చెయ్యకుండా సుబ్రమన్యాణ్ణి పలకరించి రావొచ్చు ..
రేటింగ్
మైనస్ లకి సరిపడా 35 తీసేస్తే 65/100