Saturday, March 30, 2013

Swamy Raa Raa Review

"ఆనంద్" నుండి "అలా మొదలైంది" "LBW" మొదలు అడపాదడపా మన టాలీవుడ్ లో, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు బాక్స్-ఆఫీస్ లో సందడి చెయ్యటం చూస్తూనే ఉంటాం . సో ఇప్పుడు అలా ఓ చిన్న సినిమా "స్వామి రా రా " అందరి నోళ్ళలో నానుతోంది. మరి ఈ చిట్టి సినిమాలో అసలు సరుకెంతో చూద్దాం. 

పాత కధే : ఒక కోటి రూపాయిలు బ్యాంకు నుంచి దొబ్బేసి ఆ డబ్బుని ఒక రైల్వే లాకర్ లో పెట్టి ఆ స్లిప్ ని ఓ అమ్మాయి పర్స్ లో ఉంచడం . ఆ పర్స్ కోసం ఆ అమ్మాయిని వెంబడించడం , ఆ అమ్మాయి ఒక దొంగోడి ప్రేమలో పడటం . ఓ శాడిస్ట్ విలన్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చెయ్యటం ... ఊ ఊ ఆగు ఆగు ...ఊ కొడుతున్నాం కదా అని క్షణక్షణం కథ చెప్పేస్తే ఊరుకుంటామా అంటారా !!

మరదే ఇంచుమించు కాదు, దాదాపు "స్వామి రా రా " కధాంశం అదే . వెంకటేష్ లా నిఖిల్ .. మన స్వాతేమో శ్రీదేవి ... ఇక రవిబాబు=పరేష్ రావల్ . కోటి రూపాయిల స్థానం లో పది కోట్లు విలువ చేసే వినాయకుడి (అనంత పద్మనాభస్వామి ఆలయం నుండి తస్కరించబడిన ) విగ్రహం . ఈ సింపుల్ మ్యాచ్ ది ఫాలోయింగ్ చేస్తే మీకింక ఈ సినిమాలో సస్పెన్స్ ఎం ఉండదు . ఈ సినిమా చూసాక 20 ఏళ్ళ క్రితమే ఇలాంటి సినిమాని తీసిన రాంగోపాల్ వర్మ మీద అమాంతం అభిమానం రెట్టింపయ్యింది 

ఎవరెవరు ఎలా చేసారు ... 

"హ్యాపీ డేస్" "యువత" మినహా నిఖిల్ సినిమాలు ఏవి ఆడలేదు . పైగా రవితేజని అనుకరిస్తున్నాడని విమర్శలు కూడా!! కాని ఈ సినిమా లో నిఖిల్ సింప్లీ సూపర్బ్ . ఈ సినిమాలో హెయిర్ స్టైలింగ్ కోసం తను గుండు కూడా కొట్టిన్చుకున్నాడు  . సో ఆ విధంగా డైరెక్టర్ చెప్పింది బుద్ది గా ఫాలో అయిపోయి పాత్రకి తగ్గట్టు ఒదిగిపోయాడు . ఇక డ్రెస్సింగ్ అయితే కిరాక్ . స్టైలిష్ దొంగలా కనిపించడానికి కొన్ని యురోపియన్ సినిమాలు కూడా చూసేసాడంట ( డైరెక్టర్స్ కాపీ ఫార్ములా) . ఇకనుంచైనా మంచి సినిమాలు ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు . 

తెలుగమ్మాయి మన కలర్స్ స్వాతి క్యూట్ గా ఉంది . వాగుడుకాయి పాత్రలు ఆమెకి కొట్టిన పిండి .సో ఉన్న సీన్లన్ని సునాయాసంగా లాగేసింది . "పూజ" అని ఇంకో అమ్మాయి ఉందండొయి .. అబ్బో హాట్ హాట్ గా స్క్రీన్ ని ప్రేక్షకులని వేడెక్కించింది .  ఇక హీరో ఫ్రెండ్ గా చేసినోడు కూడా కొన్ని నవ్వులు పండించాడు . జోగి బ్రదర్స్ సినిమా మొదలవ్వగానే ఒక చిన్న షాక్ ఇచ్చారు. బహుశా ఆ చిన్న షాక్ సినిమా పై ఇంకా ఆసక్తి పెంచింది 

రవిబాబు పాత్ర సాదాసీదా గా ఉంది . అంటే ఏదన్నా ప్రత్యేకంగా చేసుంటే బాగుండేది (పరేష్ రావల్ పియానో మీద ఏదో ట్యూన్ కొట్టి ఇదేం పాటరా అని అడగటం అలా.. ) . రవిబాబు పక్కన గౌన్ లో లావతను బానే నవ్వించాడు .  జీవా తదితరులు ఉన్నారు. నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు . 

మరి స్వామీ రా రా సక్సెస్ కథేంటి :
మరి సేం టూ సేం క్షణక్షణం  కథ అయితే సినిమా ఎలా హిట్టయింది అంటారా ... అక్కడే దర్శకుడి సుదీర్ వర్మ ( ఓయ్ ఈ పేరు కూడా కాపీ ఏ ) పనితనం మెచ్చుకోవాలి . తెలిసిన కథని చక్కటి స్క్రీన్ ప్లే తో ఎక్కడా పెద్దగా బోర్ లేకుండా చెప్పగలిగాడు .  అనంత పద్మనాభస్వామి ఆలయం లోని నిధుల గురించి మనం ఎన్నో కథలు వినటంతో ఈ కథ మనకి ఇంకా బాగా ఎక్కేస్తుంది .  నిఖిల్ స్వాతి ల ఫ్రెష్ పెయిర్ ఆకట్టుకుంటుంది .

అద్భుత సాంకేతిక వర్గం 
కొత్త సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ పనితనం సూపర్బ్ . సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది . అలాగే కొత్త సంగీత దర్శకుడు సన్నీ  ఇచ్చిన రెండు పాటలు ఆకట్టుకుంటాయి . ముఖ్యంగా మొదటి పాట లో ఆ దొంగతనాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి . "పాలు అన్నావ్ మరి గేదెని తోడుకోచ్చావ్ " (రవిబాబు పక్కన ఉన్నలావతని మీద సటైర్), "ఎంసెట్ లో ఫస్ట్ రాంక్ ఒచ్చి ఇంటర్ తప్పినట్టుంది " లాంటి మాటలు ఎన్నో ఆకట్టుకుంటాయి . 

ఈ కాపీల గోలేంటి !!
నేను పలానా సినిమా నుంచి కాపీ కొట్టా  అని ఈ సినిమా దర్శకుడు ఓ పెద్ద ఇంగ్లీష్ సినిమాల చిట్టాని వదిలాడు . టైటిల్స్ పడేప్పుడు కూడా ఈ విషయాన్నిగర్వంగా ఒప్పుకున్నాడు . సినిమా దర్శకుడు ఎవరైనా ఎంతో కొంత ప్రభావం సహజం . ఒకప్పుడు సమాజంలోని అంశాలతో కథలు పుట్టేవి . ఇప్పుడు ఇంగ్లీష్ కొరియా సినిమాల నుంచి మన కథలు పుడుతున్నాయి . ఎక్కడ కాపీ కొట్టినా రెండు గంటలు ప్రేక్షకుడిని ఆనందింప చెయ్యటం అలాగే కుటుంబ సమేతంగా సినిమా  ఉంటె చాలు దేవుడా అనుకునే రోజులు ఒచ్చాయి . సో అలా చూస్తె సుదీర్ వర్మని అభినందించడం మినహా ఎం చెయ్యలేం . కాని రెండో సినిమా కి కనీసం ముఖ్య కథావస్తువు లో కొత్తదనం ఉంటె సంతోషిస్తాం . 

చివరగా... 

కథ కాదు కేవలం కథనం తో మమ్మల్ని కాసేపు నవ్వించి టెన్సన్స్ దూరం చేస్తే చాలు అనుకునేవారు సరదాగా ఓ సారి సినిమా చూడొచ్చు  మంచి టాక్ వచ్చింది పైగా పెద్ద సినిమాల కన్నా ఓ రెండు వారాలు ముందే వచ్చింది కాబట్టి మంచి ప్రాఫిట్ ఒచ్చే అవకాశాలు పుష్కలం . 

రేటింగ్:
60/100

Monday, March 25, 2013

Badshaah Songs review

అమ్మో అప్పుడే ఏప్రిల్ వచ్చేస్తుంది... ఏప్రిల్ అంటే ఎండలు ... ఎండలంటే సెలవులు ... సెలవులంటే సినిమాలు.... మామూలు సినిమాలు కాదండోయి ...పెద్ద సినిమాలు చాలా ఈ వేసవికి సందడి చెయ్యటానికి వస్తున్నాయి. వాటిలో మొదటిది, అలాగే బోలెడన్ని అంచానాలు మూట కట్టుకున్న చిత్రం బాద్షా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్  జంటగా నటించిన ఈ సినిమా తీసింది  మాంచి "దూకుడు" మీదున్న శ్రీనువైట్ల గారు. ఇక సంగీతం అందించింది యువ తరంగం  తమన్ . నిజానికి ఈ వేసవి మొత్తం తమన్మయమే. ఏప్రిల్ లోనే వచ్చే షాడో, గ్రీకువీరుడు సినిమాలకి కూడా తమనే స్వరకర్త. 
సరే ఇంతకీ మన బాద్షా పాటలు ఎలా ఉన్నాయో ఒక చెవి ఎస్కుందామా ... 

సైరొ..సైరొ.. ఫీల్ మై హార్ట్ ... 

మాంచి హుషారైన పాటతో ఈ ఆల్బం మొదలవుతుంది . దూకుడులో మహేషబాబు బాబు బుద్దిగా "గురువారం మార్చ్ ఒకటి సాయంత్రం ఫైవ్ ఫార్టీ" అని ఎంచక్కా టైం తో సహా ప్రియురాలిని ఎప్పుడు చూసానో చెపుతాడు . కాని మన బాద్షాకి  అంత తీరిక లేదనుకుంటా "జూనో జులయ్యో గురుతెం లేదయ్యో, ప్రేమలో పడ్డానో తనతో " అంటూ ఈ సోలో పాట అందుకుంటాడు. రంజిత్,రాహుల్ నంబియార్, నవీన్ సంయుక్తంగా పాడిన ఈ పాట రాసింది కృష్ణచైతన్య .ఎ వెరీ గుడ్ స్టార్ట్ . 

you are my diamond girl .... 
మన ఎన్టీఆర్ కోసం ఈ సారి ఏకంగా తమిళ్ యంగ్ స్టార్ STR . అదేనండి శింబు రంగం లోకి దూకాడు. సూపర్బ్ వెస్ట్రన్ స్టైల్ సాంగ్ . స్పీడ్ గా ఉంటూనే మెలోడీ ఉన్న గీతం . "This is STR for NTR"  అంటూ పాటని ఫుల్ జోష్ తో నింపాడు శింబు . సుచిత్ర ఎమన్నా తక్కువ తిందా, శింబుకి పోటిగా అదిరిపోయేలా ఆలపించింది . రామ జోగయ్య శాస్త్రి గారు రాసారు ఈ పాటని . 

బాద్షా టైటిల్ సాంగ్ ... 
"కలహిస్తే కదం వినుకో తలదించి సలాం అనుకో ... బరిలోన సికిందర్ యే బాద్షా " అంటూ గీత మాధురి పాడిందీ పాట. విశ్వ చాలా బాగా రాసాడు . తమన్ డి ప్రత్యెక స్టైల్ టైటిల్ సాంగ్స్ విషయం లొ. ఎప్పుడు గురి తప్పడు . ఈ సారి కూడా టైటిల్ వినగానే గుర్తొచ్చే పాట ట్యూన్ చేసాడు . మొదట్లో కొంచెం డాన్ స్పురిస్తాడు . 

బంతి పూల జానకి జానకి 
ఇక ఎక్కువ మందికి నచ్చే పాట . ఈ ఫోక్ సాంగ్ కోసం దలేర్ మెహంది దిగోచ్చాడు. దలేర్ కి  జంటగా రనినరెడ్డి  వాయిస్ ఈ పాటకి మంచి ఊపునిచ్చింది . ఈ పాట ట్రైలర్ చూసినప్పుడు దూకుడు లో "దేత్తడి" గుర్తొస్తే అది మీ తప్పు కాదులెండి . అలాగే మళ్ళి మళ్ళి  వినాలనిపిస్తే ఆ తప్పు తమన్ దే !!

వెల్కమ్ వెల్కమ్ .. నా పేరు కనకం 
ఇక ఐటెం సాంగ్ వంతు . 3G లేకుండా సెల్ ఫోన్ ఉండనట్టే , ఐటెం సాంగ్ లేని మాస్ సినిమా ఉంటుందా చెప్పండి . దేవిశ్రీ తరువాత ఐటెం సాంగ్స్ తో ఆదరగొడుతుంది  తమనే. ఈ సారి కూడా "పూవ్వాయి పువ్వాయి" గుర్తొస్తే ఈ సారి ముమ్మాటికి మీ తప్పె...:) సౌమ్యారావ్ హస్కీ వాయిస్ ఈ పాటకి సరిగ్గా సరిపోయింది . భాస్కరభట్ల గారు అశ్లీలత లేకుండా సింపుల్ గా రాసారీ పాట .. రానున్న రోజుల్లో మారుమ్రోగే పాట . 

రంగొళీ రంగొళీ  ... 
అప్పుడే చివరికి ఒచ్చెసామండి ఈ సారి బాబా సెహగల్ వంతు . క్లైమాక్స్ కి ముందోచ్చే పాటలా ఉంది . రామజో గారు రాసారి ఈ బుల్లి పాట . 

అన్ని చిన్న పాటలే . ఆల్బం మొత్తం 23 మినిట్స్ లో వినేయోచ్చు . ఇదే కంబో లో ఒచ్చిన బృందావనం కంటే బాగున్నాయి బాద్షా పాటలు . ఎన్ని రోజులు గుర్తుంటాయో  తెలిదు కాని ఇప్పటికైతే కిక్కిచ్చే పాటలు . విన్న ప్రతిసారి కాలు కదుపుతూ డాన్సు వెయ్యాలనిపించెంతా ఊపు నిచ్చే పాటలు. ఆబగా ఎదురు చూసే ఫాన్స్ ని మరింతగా ఊరించేస్తున్నాయి ఈ పాటలు . తమన్ వండర్ఫుల్ జాబ్ . 



Sunday, March 3, 2013

మిథునం ... జీవిత సాగర మధనం

శ్రీరస్తు శుభమస్తు.... శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకమ్... ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితమ్... అంటూ ఆరుద్ర-బాపు గార్లు కలకాలం నిలిచిపోయేలా వర్నించారు..పెళ్లి ఘడియలని. 
ఆనక పిల్లల్ని కని. పెద్ద చేసి, వారికి రెక్కలొచ్చి దూరతీరాలకు వెళ్ళిపోయాక, తిరిగి నవ దంపతుల వలె ..ఇంకా చెప్పాలంటే ..పసి దంపతులుగా మారే వైనమ్... మరింత హృద్యం గా ఈ మిధునం లో చూడొచ్చు. తనికెళ్ళ భరణి గారి చలవ... SP బాలసుబ్రమణ్యం, లక్ష్మిల నటనా చాతుర్యం మిథునానికి వెన్నుముక.   

అమ్మా నాన్నలు.. పసి పిల్లలు 
స్నానం చేస్తుంటే కళ్ళలో కుంకుడు కాయి పడిందంటూ మారాం చెయ్యటం, అలిగినప్పుడు చెట్టెక్కడం...దొంగతనం గా బెల్లం తినడం...అలా చేస్తూ వంటింట్లో ఉన్నవి కింద పడేస్తూ వంటి మీద వేసుకోవడం .. వైకుంటపాలి లో తొండి చేయడం. సీతాకోకచిలుక కోసం పంచె ఊడిపోయేలా పరుగులు తీయడం,ఎప్పుడో జరిగిన పెళ్లి లో లాంచనాల లోటు గురించి పదే పదే వెక్కిరించుకోవడం...అదేదో ద్రాక్షారామం సంభందం గురించి మొగుణ్ణి ఉడికించడం, దిష్ఠి బొమ్మలతో కొట్టుకోడం ఇలా ఒకటేంటి అన్ని వయసు మల్లినా మురిపించే పసి పిల్లల చేస్టలే. 

ఘుమఘుమలొయ్..ఘుమఘుమలు... 
ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర వంటది. ఆ ఇంటాయనకి పాపం తిండి యావ ఎక్కువ. పాపం అందుకే ఆ శ్రీమతి తన అమృతహస్తాలతొ నిరంతరం షడ్రసోపేతమైన వంటకాలు సిద్ధం చేస్తుంది . జొన్నవిత్తుల గారు రాసిన కాఫీ దండకం వింటే అమాంతం కాఫీ తాగాలాని మనసు లాగకపోతే అడగండి . పండగ పూట ప్రొద్దున్నే లేపి మాపటి దాక కడుపు మాడ్చావని మారాం చేస్తాడు అప్పలదాసు. పెళ్ళాం మౌనవ్రతం లో ఉన్నా సరే చారు ఇంగువ గురించి చెప్పి ఆమెని విసిగిస్తాడు. దొంగ బెల్లం కోసం ఆరాటం ... రాత్రి వేళ  కూడా సెనగలు మామిడి తాండ్ర అంటూ అనుక్షణం తిండి గురించే పాపం ఆయన తపన. అందుకే అతని మనవడు అప్పడం తాత పొట్ట మీద ఏకంగా ఒక కార్టూన్ ఫిలిం తీసేస్తాడు. "ఆవకాయ మన అందరిది గోంగూర కూడా మనదేలే ... ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లు.. ఎందుకు పాస్తాలింకేందుకులే " అనే పాట వింటే అప్పుడే బొంచేసినా మళ్ళి ఆకలి వేస్తుంది. ఆఖరి లో బుజ్జి మొగుడి మీద వేసే విసురు " తిండి కలిగితే కండ కలుగునని గురజాడ వారు అన్నారు, అప్పాదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటల తెగ తిన్నారు"

ఒకరికి ఒకరు... 
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ... పిల్లలంతా ఎం చెక్కా విదేశాలు లేక హైదరాబాదులకి చెక్కేస్తే ..పాపం మిగిలేది వారిద్దరే, వారికి తోడుగా ఎన్నో జ్ఞాపాకలు. ఖాళిగా కూర్చోకుండా సకలకళా వల్లబుని వలే తోట పని.ఽఅవు దూడల పని దూది ఏకడం లాంటివి చెయ్యటం అప్పదాసుకి ఇష్టం . ఒకసారి బావి లో దొరకిన పాత వస్తువుల్ని చూసుకుంటూ పిల్లల్ని గుర్తుకు తెచ్చుకున్తారు. వారు ఫోన్ చేసినపుడల్లా వారి ఊసులతో కళ్ళు తడుపుకుంటారు. 

ఒక సారి పాత చీరలు చూపిస్తూ ...తన భార్య ఎ సందర్బం లో ఏ చీర కట్టుకుందో అప్పలదాసు చెపుతుంటే ఆమె తో పాటు మనకి ముచ్చటేస్తుంది. నేను లేకుండా ఒక్క దానివే స్వర్గానికి ఎలా వెళ్తావ్ అని ఆమె చిరని చేతికి కట్టుకునే ఆ పసితనం, తన కోసం అన్ని చేసే ఆవిడ కోసం చక్కగా చీర ఉతకడం జడ వెయ్యడం కాళ్ళు మర్దన చెయ్యడం లో ఆనందం ఆయనకే తెలుసు. ఆయన చేతికి రక్తం ఒస్తే ఆమె ఏడుస్తుంది . మొగుడికి తేలు కుడితే ఆమె వేసే మంత్రం ఏమిటో తెలుసా.. "వెంకటరమణా ఆయన నెప్పి నాకివ్వు స్వామీ"  అని. ఆమెకి నిరంతరం ఒకటే తపన ఎక్కడ తను ముందు పైకి పొతే మొగుడు నానా అవస్త పడతాడేమో అని చివరగా బంగారం పోయి లక్క మిగిలిందని చెప్పే వైనం వారి బంధం ఒక్క విలువ కళ్ళకి కడుతుంది. 

ఇదే పేరుతో వచ్చిన శ్రీరమణ గారి నవల ఈ చిత్రానికి స్పూర్తి. (విషయం ఏంటంటే ఇదే పుస్తకం ఆదారంగా మలయాళం లో 2000 లో "ఒరు చేరు పుంచిరి" అనే సినిమా తీసి బోలెడన్ని అవార్డులు కొట్టేసారు వారు. పోన్లే ఆలస్యం గా అయినా మన వాళ్ళు ఈ సినిమా తీసారు). అందుకే తనికెళ్ళ భరణి గారికి పాదాబివందనాలు( బోలెడన్ని అద్బుతః లు )  తప్పక చెయాలి.  రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫి లో ఆ చిన్న ఇల్లే అత్యంత అందంగా కనిపించింది . స్వర వీణాపాణి సంగీతం అద్బుతః  .  ఇక నిర్మాతలకి ఒక పెద్ద థాంక్స్ చెప్దామా..!!
  
చివరగా (తెలిసొచ్చిన విషయాలు)... 
రక్త సంబందీకుల గురించి అల్లాడి పోడం మానవ సహజమ్. కాని ఈ "పెళ్లి" అనే బంధంతో మన తోడుగ నిలిచే వారి కోసం తపించడం ఎంత సముచితమో తెలిపిందీ మిథునం. వేల ప్రేమ కథలు చెప్పలేని ప్రేమ-పెళ్లి లోని పరమార్ధం ఈ మిథునం వివరించింది. 

మర్చిపోకుండా చూడండి 
ఘుమఘుమ లాడే తెలుగు భోజనం ముందుంటే డైటింగ్ అంటూ కడుపు మాడ్చుకోకూడదు . అలాగే పదహారణాల తెలుగు సినిమా తీస్తే టైం లేదంటూ చూడకుండా ఉండకూడదు. థియేటర్ లో ఎలాగు చూడలేదు కనీసం యు ట్యూబ్ లో అయినా చూడాలి ఈ సినిమాని. ఇదిగో లింక్  .. అధ్బుతః 
http://youtu.be/13TQ13cdrXg